Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు పోలీసులు అడ్డు తగిలారు. కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టిన కాసేపటికే అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు ..తాఖీదులు ఎందుకు ఇస్తున్నారో రాత పూర్వక వివరణ ఇవ్వాలని కోరారు. తన పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కుప్పం నియోజకవర్గం పరిధిలోని పెద్దూరు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ఇది నా సొంత నియోజకవర్గం. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. గత నెలలో కుప్పం నియోజకవర్గానికి వస్తానని డీజీపీకి పర్యటన వివరాలు పంపించా. అక్కడి నుంచి ఎస్పీకి పంపించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 1 తీసుకొచ్చింది. సీఎం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో మీటింగ్లు పెట్టాలని జీవో తెచ్చారు. నిన్న సీఎం మీటింగ్ పెట్టారు. రాజమహేంద్రవరంలో రోడ్లు బ్లాక్ చేశారు. విద్యా సంస్థలు మూసేశారు. ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు. జగన్కు ఓ రూలు.. నాకు ఓ రూలా? జగన్ పని అయిపోయింది. ఇంకోసారి గెలవడు. ఇంటికి పోయే రోజులు దగ్గరికి వచ్చాయని భయపడే చీకటి జీవో తెచ్చారు. ప్రజా స్వామ్యంలో ప్రతి ఒక్కరూ తిరిగే స్వేచ్ఛ ఉంది. నా సొంత ఇంటికి నేను రాకుండా ఉండాలనే ఆంక్షలు పెట్టారు.