Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలపడమే లక్ష్యంగా రూపొందించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం రూ.19,744 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. హైడ్రోజన్ మిషన్ కోసం కేటాయించిన రూ.19,744 కోట్లలో రూ.17,490 కోట్లు సైట్ ప్రోగ్రామ్‌కు కేటాయించనున్నారు. పైలట్ ప్రాజెక్టుల కోసం రూ.1446 కోట్లు, ఆర్‌అండ్‌డీకి రూ.400 కోట్లు, మిషన్‌కు సంబంధించి ఇతర విభాగాల కోసం రూ.388 కోట్లు కేటాయించనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను కొత్త, పునరుత్పాదక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. 2030 నాటికి 125 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, అలాగే, ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్ లక్ష్యం. ఈ మిషన్ ద్వారా 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల మేర పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నది కేంద్రం అంచనా. దీనికి తోడు 2030 నాటికి లక్ష కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు తగ్గడంతో పాటు 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.