Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన ప్రయాణికుడిని పట్టుకొనేందుకు పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బిజినెస్ తరగతిలో ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటన అందరినీ షాకింగ్‌కు గురిచేయగా.. తాజాగా అదే తరహాలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. డిసెంబర్ 6న పారిస్-ఢిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే, అతడు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఏ తరగతిలో ఈ దుశ్చర్య జరిగిందన్న విషయం మాత్రం తెలియలేదు. డిసెంబరు 6న ఉదయం 9:40 గంటలకు విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. మద్యం మత్తులో ఉన్న నిందితుడు క్యాబిన్ సిబ్బంది సూచనల్ని పట్టించుకోలేదని, అంతేకాకుండా ఓ మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రం పోసినట్టు భద్రతా సిబ్బందికి సమాచారం అందింది. దీంతో అతడు విమానం దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ప్రయాణికులిద్దరి మధ్య రాజీ కుదరడం, నిందితుడు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో విడిచిపెట్టినట్టు తెలిపారు.