Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో తాజా ఓటరు జాబితా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల యువతీ, యువకులు కొత్తగా 2,78,650 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఏటా ఓటర్ల జాబితా సవరణ తర్వాత జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్సరాజ్ 2023 తుది ఓటర్ల జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం సాధారణ ఓటర్లు 2,99,74,919 ఉన్నారు. వీరిలో పురుషులు 1,50,48,250 మంది, మహిళలు 1,49,24,718 మంది ఉండగా, థర్డ్ జెండర్ 1951 మంది ఉన్నారు.
ఎన్ఆర్ఐ ఓటర్లు 2,740బీ సర్వీసు ఓటర్లు 15,282 మందిని కలుపుకొని మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941గా ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలో గత ఏడాది 34867 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటి సంఖ్య 34891కి పెరిగింది. గత ఏడాది రాష్ట్రంలో 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా డబుల్ ఫొటోలు, నిరంతర మార్పులు, ఇతర కారణాల వల్ల రాష్ట్రంలోని ఓటర్ల జాబితా నుంచి దాదాపు 11,36,873 ఓట్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కొత్త ఓటర్లు భారీగానే నమోదు చేసుకున్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 3,63,953 తగ్గింది. రాష్ట్రంలోనే అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,41,072 మంది ఓటర్లు, అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,42,813 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తుది జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య 42,15,450కి చేరింది.