Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికలో తీవ్ర రసాభాసా చోటుచేసుకుంది. మేయర్ ఎన్నిక కోసం ఉదయం సమావేశమైన మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. కాగా, డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. 15 ఏండ్లుగా బీజేపీ పాలనకు ఆప్ గండికొట్టింది. మొత్తం 250 వార్డులున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఆప్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి 134 స్థానాలకు కైవసం చేసుకుంది. ఆప్ తరఫున షెల్లీ ఒబెరాయ్ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు.
మేయర్ ఎన్నిక నిమిత్తం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీకు చెందిన సభ్యుడిని ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఇది ఆప్-బీజేపీ సభ్యుల మధ్య గందరగోళానికి దారితీసింది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అనేక నియామకాలు చేపట్టారని, మేయర్ ఎన్నికను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే బీజేపీకి అనుకూలంగా ఉన్న సభ్యులనే గవర్నర్ నామినేట్ చేశారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. నామినేటెడ్ పదవులకు పేర్లు ప్రకటించిన తర్వాత ఎల్జీ బీజేపీ సభ్యుడైన సత్యశర్మను ప్రిసైడింగ్ స్పీకర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఆప్ ప్రతిపాదించిన సీనియర్ సభ్యుడైన ముకేశ్ గోయల్‌ను పక్కనపెట్టి.. శర్మకు తాత్కాలిక పదవి ఇచ్చారు. ఎల్జీ వ్యవహరించిన తీరును ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ట్విటర్ వేదికగా తప్పు పట్టారు. బీజేపీ అన్ని ప్రజాస్వామ్య విలువలను, వ్యవస్థలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ గందరగోళానికి ఆప్ కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇరువర్గాలు నినాదాలు చేస్తుండటంతో నిరసనలు కొనసాగాయి.