నవతెలంగాణ - చిత్తూరు మూడో రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల ఆంక్షలకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు టీడీపీ అధినేత యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రచార రథం అప్పగించాలంటూ టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. దీంతో గుడిపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సమావేశం జరుగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులదేన్నారు. టీడీపీ కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెడతారా అంటూ మండిపడ్డారు. మూడు రోజులుగా పోలీసుల అరాచకాలను చూస్తున్నామన్నారు. బానిసలుగా బతకద్దని పోలీసులకు సూచించారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ నేతల ర్యాలీలు చేస్తున్నారని వారికో రూలు తమకో రూలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే పోలీసులపై ప్రజలు ఉమ్మేస్తారన్నారు. నా నియోజకవర్గంలోనూ నేను పర్యటించకూడదా? నా ప్రజలను కలిసేందుకు నాకు హక్కు లేదా?. ప్రజాహితం కోసమే నా పోరాటం. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమే అని చంద్రబాబు స్పష్టం చేశారు.