Authorization
Fri May 16, 2025 08:07:03 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించింది. గతేడాది 8.7 శాతంతో పోలిస్తే ఈ సారి తక్కువ వృద్ధి నమోదు కానుండడం గమనార్హం. మైనింగ్, తయారీ రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడమే దీనికి కారణం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (చీూఉ) శుక్రవారం తన తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ వెలువరించిన 6.8 శాతం వృద్ధి అంచనాలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం 1.6 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేయొచ్చని గణాంక కార్యాలయం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 9.9 శాతం వృద్ధి నమోదు చేసింది. అలాగే, మైనింగ్ రంగం సైతం గతేడాది 11.5 శాతం వృద్ధి నమోదు చేయగా.. ఈ సారి కేవలం 2.4 శాతం మాత్రమే నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇక స్థిర ధరల (2011-12) ప్రకారం రియల్ జీడీపీని గణించినప్పుడు ఈ ఏడాది రూ.157.60 లక్షలు కోట్లుగా ఉండనుందని గణాంక కార్యాలయం వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం ఇది రూ.147.36 లక్షల కోట్లుగా ఉంది. అదే ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీని లెక్కించినప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లుగా ఉండనుంది. గతేడాదికి గానూ ఈ మొత్తం రూ.236.65 కోట్లుగా అంచనా వేసింది.