Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీహార్‌లో కులాల వారీగా జనగణన ప్రారంభమయింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు. ఈ సందర్భంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి వంటి వివరాలను ప్రజల నుంచి సేకరిస్తారు. ఇది పూర్తిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌గా జరుగనున్నది. ముఖ్యంగా ఓబీసీల స్థితిగతులను ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. దీనికోసం సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. మొదటి దశ నేటి నుంచి ఈ నెల 21 వరకు కొనసాగుతుంది. రెండో దశ ఏప్రిల్ నెలలో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. నేటి నుంచి మొదటి దశ కుల జనగణన ప్రారంభమవుతుందని చెప్పారు. దీనిద్వారా ప్రభుత్వానికి శాస్త్రీయ గణాంకాలు లభిస్తాయన్నారు. తద్వారా పేదలకు లబ్ధి చేకూరేలా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. రెండు విడుతల్లో ఇది కొనసాగుతుందని, జనవరి 21న మొదటి దశ పూర్తవుతుందన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు రెండో విడుత సర్వే జరుగనుందని చెప్పారు. కుల గణనకు బీజేపీ అడ్డుపడుతున్నదని, ఆ పార్టీ పేదల వ్యతిరేకి అని విమర్శించారు. కులగణన జరగొద్దని బీజేపీ కోరుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.