Authorization
Fri May 16, 2025 07:26:19 pm
హైదరాబాద్ : ముంబై విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రెండు వేర్వేరు కేసుల్లో ఏకంగా 47 కోట్ల విలువైన మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు.. ఈ కేసులోని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ జోనల్ యూనిట్ అధికారులు శుక్రవారం విమనాశ్రయంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 31.29 కోట్ల విలువగల 4.47 కిలోల హెరాయిన్.. అలాగే 15.96 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేస్తున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ మొత్తం పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి కెన్యాలోని నైరోబీ మీదుగా ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఓ వ్యక్తిని చెక్ చేయగా.. 4.47 కిలోగ్రాముల హెరాయిన్‌తో పట్టుబడినట్లు తెలిపారు. పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసిన హెరాయిన్‌ను 12 డాక్యుమెంట్ ఫోల్డర్ల కవర్లలో చాకచక్యంగా దాచిపెట్టి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన డ్రగ్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.31.29 కోట్లుగా అంచనా వేస్తున్నారు
మరో కేసులో.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తి లగేజ్ స్కాన్ చేయడంతో అనుమానాస్పద బటన్‌లు కనిపించాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టగా.. కుర్తా బటన్లు పక్కపక్కనే ఉండి ఎక్కవ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. బట్లను తీసి పరిశీలించగా 1.59 కిలోగ్రాముల కొకైన్ లభించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టంలో ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.