Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రోజాది నోరా లేక మున్సిపాలిటీ కుప్ప తొట్టా... ఎవరైనా కుప్ప తొట్టిని కెలుకుతారా...? రోజా ఇలాగే మాట్లాడుతూ పోతే దేశంలో ఏపీ పర్యాటక రంగం దిగువకు పడిపోతుంది అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై మంత్రి రోజా ఫేస్ బుక్ లో స్పందించారు. ఏదైనా విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలే తప్ప, నోటికి ఎంత మాట వస్తే అంత వాగడం, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం సబబు కాదని నాగబాబుకు హితవు పలికారు.
ఏమీ తెలియకుండా నా శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం వాళ్ల అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. నేను టూరిజం మంత్రిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో ఏపీ టూరిజం మూడో స్థానంలో ఉంది. ఇదేమీ తెలియకుండా మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉంది. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా పర్యాటక పరంగా ఏపీకి ఏంచేశారని నేను ఏనాడూ రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ విషయాలపై నేను మాట్లాడను కూడా. గతంలో మీరూ మీరూ (టీడీపీ-జనసేన) మాట్లాడుకున్న మాటలను గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో అర్థం కావడంలేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిమీద శత్రుత్వం లేదు. పార్టీపరంగా, సిద్ధాంతపరంగానే నా వ్యాఖ్యలు ఉంటాయన్న విషయం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నన్ను అంత మాట అన్నందుకు నేను కూడా మిమ్మల్ని ఓ మాట అనొచ్చు... కానీ అందుకు నా సంస్కారం అడ్డొచ్చింది. చివరగా ఒక్క మాట... నాడు మీ పార్టీ వాళ్లను అలగాజనం అని ఎంతో హీనంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందో పైవాడికే తెలియాలి. ఓడిపోయిన మీరే అన్ని మాటలు అంటుంటే, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను ఎంత అనాలి! వ్యక్తిగత విమర్శలు చేయడం నాకు ఇష్టం లేక, మిమ్మల్ని ఆ మాట అనలేక వదిలేస్తున్నా. ముందు మహిళలను ఎలా గౌరవించాలో తెలుసుకోండిఁ అంటూ రోజా పేర్కొన్నారు.