Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : గ్రేటర్లో శనివారం ఉదయం 6.20 నుంచి 8.10 గంటల్లోపు చైన్ స్నాచర్లు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 1గంటా 50 నిమిషాల్లోనే ఆరు చైన్ స్నాచింగ్‌లు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై బారికేట్లు ఏర్పాటు చేసి శనివారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు బైకర్లను చెక్‌చేశారు. బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్, టప్పాచబుత్ర, ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహించారు. దీంతో సరైన పత్రాలు, నంబర్ప్లేట్లు లేని వాహనాలను భారీగా పట్టుకున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. శనివారం ఉదయం ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, సీతాఫల్మండి, హబ్సీగూడ, నామాలాగుండులో ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్‌కు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దుండగులు స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. స్నాచింగ్‌కు పాల్పడింది ఢిల్లీ లేదా యూపీ, రాజస్తాన్ ముఠాల పనే అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయం, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించి 18చోట్ల ఉన్న సీసీ పుటేజీలను సేకరించినట్లు సమాచారం. నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనాలకు నెంబర్ప్లేట్లు లేకపోవడంతో వాహనాలను గుర్తించేందుకు పోలీసులు కసరత్తు మొదలు పెట్టారు.