Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఆర్ధిక మందగమనం వణికిస్తుండటంతో పలు టెక్ కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం లేఆఫ్స్‌లో భాగంగా 18,000 మంది ఉద్యోగులను సాగనంపనుండగా మరో టెక్ కంపెనీ సిస్కో ఏకంగా 700 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, ప్రోగ్రాం మేనేజ్మెంట్, ప్రోడక్ట్ డిజైన్, మార్కెటింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించినట్టు ఎస్‌ఎఫ్‌గేట్ వెల్లడించింది. బాధిత ఉద్యోగుల్లో 371 మంది కాలిఫోర్నియా, శాంజోస్‌లో పనిచేస్తున్నవారని వెల్లడైంది. వీరిలో ఇద్దరు సిస్కో వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారని ఆ రిపోర్ట్ తెలిపింది. మిల్పిటాస్లో ఇంజనీర్లు టెక్నికల్ ఉద్యోగులుగా పనిచేసే 22 మంది ఉద్యోగులను కూడా విధుల నుంచి సిస్కో తప్పించింది. కంపెనీ శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయానికి చెందిన 80 ఉద్యోగులను కూడా సిస్కో యాజమాన్యం సాగనంపింది. ఆర్ధిక మందగమనం, వ్యయాల పెరుగుదలతో ఖర్చులకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో సిస్కో కొలువుల కోతకు పాల్పడిందని సమాచారం. ఇక కొన్ని వ్యాపారాల సుస్ధిర వృద్ది కోసమే కొందరు ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కంపెనీ సీఈఓ చక్ రాబిన్స్ పేర్కొన్నారు.