Authorization
Sat May 17, 2025 01:33:22 am
నవతెలంగాణ హైదరాబాద్: వండే ముందు చికెన్‌ను కడగటం సాధారణంగా అందరం చేస్తాం. అందులోనూ నీటిధార కింద పెట్టి కడగడం కూడా చేస్తుంటాం. అలా నీటిధార కింద పెట్టి కడగడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవిధంగా ఆ తుంపర్లు వంటగది అంతా చిమ్మి ప్రమాదకరమైన కాంపైలోబాక్టర్, సాల్మొనెల్లా అనే బాక్టీరియాలు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ జరిపిన సర్వేలో ఇది మరోసారి రుజువైంది. ఇక్కడి జనాభాలో సగం మందికి పైగా చికెన్‌ను నీటి ధారలో కడుగుతున్నారు. దీనివల్ల గడిచిన 20 ఏండ్లలలో ఆస్ట్రేలియాలో కాంపైలోబాక్టర్, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్‌లు రెట్టింపు అయినట్లు తెలిపారు. అత్యాధునిక మార్గాల్లో మాంసం ఉత్పత్తి చేస్తున్న ఈ రోజుల్లో చికెన్‌ను కడగాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు. భారత్ లాంటి దేశాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులుంటాయి కాబట్టి తప్పని సరిగా చికెన్ కడగాలి. అయితే ముందే పట్టి ఉంచిన నీటితో శుభ్రంగా కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అనంతరం శుభ్రమైన పొడి వస్త్రంతో మాంసాన్ని బాగా తుడిచి, దానిని సురక్షిత ప్రదేశంలో ఉంచాలని సలహా ఇస్తున్నారు. మరికొంత మంది వెనిగర్, నిమ్మ రసాలతో చికెన్‌ను శుభ్రం చేస్తారని, దీని వల్ల కూడా ఉపయోగం లేదని తెలిపారు. ఈ విధానంలోనూ బాక్టీరియా వ్యాప్తి చెందుతుందని వివరించారు.