Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో తాజాగా మాజీ ఆర్మీ చీఫ్‌తోపాటు మాజీ సైనిక అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ఆదివారం నాటి ‘భారత్ జోడో యాత్ర’లో ఆర్మీ స్టాఫ్ మాజీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్, మాజీ సైనిక అధికారులు లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే హుడా, లెఫ్టినెంట్ జనరల్ వీకే నరులా, ఏఎమ్ పీఎస్ భంగు, మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ చౌదరి, మేజర్ జనరల్ ధర్మేందర్ సింగ్, కల్నల్ జితేందర్ గిల్, కల్నల్ పుష్పేందర్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ డీడీఎస్ సంధు, మేజర్ జనరల్ బిషంబర్ దయాల్, కల్నల్ రోహిత్ చౌదరి వంటి వారు పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి వారు కొంత దూరం నడిచారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలు చర్చించారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న మాజీ సైనిక అధికారుల ఫొటోలను కూడా అందులో పోస్ట్ చేశారు.
కాగా, కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ‘భారత్ జోడో యాత్ర’ ఇప్పటికే 12 రాష్ట్రాల మీదుగా సాగింది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలతో మమేకం అయ్యేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ఈ నెలాఖరులో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగుస్తుంది.