Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గుండెపోటు మరణాలు సర్వసాధారణమే. 50 ఏళ్లు పైబడిన వారు సాధారణంగా గుండెపోటు బారినపడుతూ ఉంటారు. 35 ఏళ్లు దాటిన వారికి కూడా హార్ట్ఎటాక్ ముప్పు పొంచి ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, అప్పటి వరకు ఆటపాటల్లో మునిగి తేలిన 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణిస్తే? అవును.. కర్ణాటకలోని మడికేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జిల్లాలోని కూడుమంగళూరుకు చెందిన మంజాచారి పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ తల్లడిల్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కుశాలనగర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని నిర్దారించారు.