Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి దూకుడు పెంచుతున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తొలి భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ సభను తొలుత ఢిల్లీలో నిర్వహించాలని భావించినప్పటికీ... రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోనే సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18న ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తున్నారు. అదే రోజును ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ సభకు సంబంధించి నిన్న రాత్రి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామానాగేశ్వరరావుతో పాటు పలువును నేతలతో కేసీఆర్ చర్చించారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు మాజీ సీఎంలు, వివిధ రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను ఆహ్వానించనున్నారు. ఈ సభను తెలంగాణలో ఎన్నికల పర్వానికి నాందిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.