Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తర్‌ప్రదేశ్
పొగమంచు కారణంగా లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ నుంచి సుల్తాన్పూర్ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై కన్నౌజ్ వద్ద ట్రక్కును ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా సుమారు 18 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసు అధికారి కమల్ భాటియా తెలిపారు. మృతులు రాయ్‌బరేలీకి చెందిన అనిత బజ్పాయ్ (50), సంజన (25), దేవాన్ష్ (10) గా గుర్తించినట్లు తెలిపారు.
ఇదే తరుణంలో ఉన్నావ్ జిల్లా ఔరా వద్ద బస్సు ట్రక్కును ఢీ కొట్టిన మరో ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు. బస్సు గుజరాత్ రాష్ట్రం నుంచి లఖింపూర్ ఖేరీలోని నేపాల్ సరిహద్దుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్టేషన్ హెడ్ ఆఫీసర్ రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు నేపాల్‌కు చెందిన లలిత్ సౌద్ (35), చందర్ సౌద్ (50)గా గుర్తించినట్లు తెలిపారు. పొగమంచు కారణంగా విజబిలిటీ తక్కువగా ఉండటం వల్ల ఈ రెండు ప్రమాదాలు జరిగినట్లు పోలీసు అధికారులు అన్నారు.