Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: బ్రెజిల్ అగ్నిగుండంలా మారింది. అధికారం కోసం మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు ఏకంగా ఆదేశ రాజధానిలోని కీలక భవనాలను ఆక్రమించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని అంగీకరించడం లేదు. సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పడంగానీ లేదా ప్రస్తుత అధ్యక్షుడు లూలాను అధికార పీఠం నుంచి దింపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా వారు నిరసనకు దిగారు. సుప్రీం కోర్టు, కాంగ్రెస్, అధ్యక్ష భవనాల్లోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు. గత వారమే దేశాధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆదివారం వేలమంది బోల్సొనారో మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేదించుకొని అధికారిక భవనాల్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో భవనాల్లో ఎవరూ లేకపోవడంతో ఆందోళనకారులు అక్కడ కిటికీలను, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. బ్రెజిల్లో సుప్రీం కోర్టు, నేషనల్ కాంగ్రెస్, అధ్యక్ష భవనాలను దేశ అధికార కేంద్రాలుగా భావిస్తారు. ఈ చర్యతో సుప్రీం కోర్టు వద్ద భద్రతా దళాలు హెలికాప్టర్ల నుంచి టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. అక్కడ అల్లర్లను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై కూడా దుండగులు దాడులకు పాల్పడ్డారు. దాదాపు మూడు వేల మందికిపైగా అల్లరి మూకలు వీటిల్లో పాల్గొన్నట్లు అంచనా. కొందరు ఆందోళనకారులు పోలీసులపై దాడులకు కూడా దిగారు. సమయం గడిచే కొద్దీ అల్లరి మూకల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ కాంగ్రెస్ భవనం వద్ద పోలీసులు ఇప్పటికే 300 మందిని అరెస్టు చేశారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లను ఈ ఘటనలు తలపిస్తున్నాయి.
రంగంలోకి భద్రతా దళాలు..
బ్రెజిల్లో అల్లర్లపై దేశాధ్యక్షుడు లూలా స్పందిస్తూ.. ‘వారు చేసిన పని వర్ణించలేము.. దోషులు శిక్ష అనుభవించాల్సిందే’ బోల్సొనారోనే అల్లరి మూకలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ఆ మూకలను ఫాసిస్ట్ మతోన్మాదులుగా ఆయన అభివర్ణించారు. భద్రతా దళాలు ఈ అల్లర్లను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సొనారోకు 49.1శాతం వచ్చాయి. ఎన్నికల ఫలితాలను అంగీకరించాడానికి బోల్సొనారో నిరాకరిస్తున్నారు. దేశంలోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన ఆరోపిస్తున్నారు.