Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ సినికివె ఎంపోఫు హఠాన్మరణం చెందింది. 37 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన నివాసంలో శనివారం కుప్పకూలిన సినికివె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. సినికివె భర్త, జింబాబ్వే క్రికెట్ పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్ షెఫర్డ్ మకునురా మరణించిన రోజుల వ్యవధిలోనే ఆమె కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వీడటం విషాదకరం. షెఫర్డ్ డిసెంబరు 15న చనిపోయాడు. కాగా ఇద్దరు కీలక వ్యక్తులు ఇలా అకస్మాత్తుగా దూరం కావడంతో జింబాబ్వే క్రికెట్ శోకసంద్రంలో మునిగిపోయింది. కఠిన శ్రమకోర్చి కెరీర్లో మంచి స్థాయికి చేరుకున్న ఈ సినికివెను చావు తమ నుంచి దూరం చేసిందంటూ జింబాబ్వే మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోని విచారం వ్యక్తం చేశారు. జింబాబ్వే మహిళా క్రికెట్లో ఆదర్శనీయమైన వ్యక్తిగా ఎంతో మంది ఆదరాభిమానాలు చూరగొన్న ఆమె ఇలా అర్ధంతరంగా వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని సంతాపం వ్యక్తం చేశారు.
సినికివె, షెఫర్డ్ దంపతుల హఠాన్మరణం వారి కుటుంబాలతో పాటు తమకు కూడా తీరని లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. వీరి పిల్లలు, తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జాతీయ జట్టులో కీలకమైన ఇద్దరు సభ్యులను కోల్పోయామని.. ఇంతటి విషాదం మరెక్కడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సినికివె 2006లో జింబాబ్వే తరఫున క్రికెట్ ఆడిన తొలి మహిళా జట్టులో సభ్యురాలు. ప్లేయర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత ఆమె కోచింగ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. మహిళా జట్టు అసిస్టెంట్ కోచ్ స్థాయికి ఎదిగింది. మౌంటనీర్స్ వుమెన్‌ను ఫిఫ్టీ50 చాలెంజ్‌లో విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది.