Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : గుట్కా ప్యాకెట్లలో గుట్టుగా దాచిన సుమారు రూ.33 లక్షల విలువైన విదేశీ కరెన్సీ నోట్ల అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకాక్ వెళ్తున్న ఒక ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఒక వ్యక్తి బ్యాంకాక్‌కు వెళ్లేందుకు భారీ లగేజ్‌తో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. కోల్‌కతా కస్టమ్స్‌కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఈయూ) అధికారులు అతడి లగేజ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ట్రాలీ సూట్‌కేసులను తెరిచి చూడగా వాటి నిండా గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. కాగా, కస్టమ్స్ అధికారులు గుట్కా పౌచ్‌లను చింపి పరిశీలించారు. ప్రతి పౌచ్‌లో రెండేసి చొప్పున ఉన్న పది డాలర్ల నోట్లను వెలికితీశారు. భారత కరెన్సీలో రూ.32.78 లక్షల విలువైన 40 వేల అమెరికా డాలర్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దీనిపై ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కోల్‌కతా కస్టమ్స్ అధికారులు విడుదల చేశారు. గుట్కా పౌచుల్లో రహస్యంగా దాచిన అమెరికా డాలర్ నోట్లను వెలికి తీసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.