Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : గత పది రోజులుగా ఉత్తర భారతాన్ని తీవ్రమైన చలి, పొగమంచు వణికిస్తోంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా రోడ్డు, రైలు, విమాన మార్గాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ విమానాశ్రయం సమీపంలో దట్టమైన పొగమంచు ఆవరించింది. దీంతో ఢిల్లీ నుంచి ముంబయి, చెన్నై, సిమ్లా, శ్రీనగర్, జైపూర్, గువాహటి, ఖాట్మండు, వారణాసి తదితర ప్రాంతాలు మధ్య నడవాల్సిన సుమారు 40 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇక 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని నార్తర్న్ రైల్వే శాఖ ప్రకటించింది. ఐఎమ్‌డీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో ఉదయం 6.10 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 19 నుంచి 07 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉదయం పాలం వద్ద 100 మీటర్ల దూరంలోని వాహనాలు కనిపించలేదు. ఇక పంజాబ్‌లో జీరో విజిబిలిటీ నమోదైంది. గంగానరగ్, చండీగఢ్, వారణాసి, గయలో విజిబిలిటీ 25 మీటర్లుగా నమోదైంది. అంబాలా, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్, పాలం, లఖ్‌నవూ, భగల్పూర్లో 50 మీటర్ల దూరంలోని వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. బుధవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత 421గా నమోదైనట్లు ఐఎమ్‌డీ వెల్లడించింది.