Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బెంగళూరు: బెంగళూరులో మెట్రో పిల్లర్ కూలిన ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, రెండున్నరేండ్ల బాబు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో తాను సర్వం కోల్పోయానంటూ బాధితుడు లోహిత్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లర్ కూలిపోవడంతో ఆయన తన భార్య తేజస్విని, రెండున్నరేళ్ల కుమారుడిని కోల్పోయారు. ప్రమాదం గురించి ఆయన తెలియజేస్తూ ‘ప్రమాద సమయంలో మా పిల్లలతో కలిసి బైక్ మీద వెళ్తున్నాం. పిల్లలను డేకేర్‌లో దింపి, మేం ఉద్యోగాలకు వెళ్తుంటాం. రోజులాగే వెళ్తుండగా సెకన్ల వ్యవధిలో ఈ ఘటన జరిగింది. నేను వెనక్కి తిరిగి చూస్తే.. నా భార్య, కుమారుడు కింద పడిపోయి ఉన్నారు. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. నేను సర్వం కోల్పోయాను. ఇక నేను ప్రభుత్వానికి చెప్పేదేముంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని కన్నీటిపర్యంతమయ్యారు.
గదగకు చెందిన లోహిత్ కుమార్, తేజస్విని దంపతులకు ఇద్దరు పిల్లలు. లోహిత్ కుమార్ ఒక ప్రయివేటు కంపెనీలో సివిల్ ఇంజినీరు. తేజస్విని మోటరోలా కంపెనీ ఉద్యోగిని. ఆమెను కంపెనీ వద్ద, పిల్లలను ప్లేహోంలో వదిలిపెట్టేందుకు బైకుపై వెళ్తుండగా హెచ్బీఆర్ లేఅవుట్ వద్ద సోమవారం ఉదయం 10.30కు పిల్లర్ సెంట్రింగ్ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. తేజస్విని, ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించేలోగా మరణించారు. మిగతా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మెట్రో నిర్మాణ పనులు చేపడుతోన్న కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసేవరకు తాము మృతదేహాలను ఇక్కడి నుంచి తీసుకెళ్లమని మృతురాలి తండ్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘నా కోడలు దేవనగరే నుంచి 10 రోజుల క్రితమే బెంగళూరు వచ్చింది. నా కోడలు, మనవడిని కోల్పోయాను. మాకు న్యాయం కావాలి. ఒక్క ఉన్నతాధికారి కూడా ఘటనాస్థలానికి రాలేదు’ అని బాధితుడు తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా ఈ నిర్మాణ పనులు చేపట్టడం వల్లే తమకు ఇంత నష్టం వాటిల్లిందని లోహిత్ తండ్రి అన్నారు. ఈ ఘటనతో తమ అందమైన కలలన్నీ కుప్పకూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై విరుచుపడిన కాంగ్రెస్
ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఒక కాంట్రాక్టులో 40 శాతం తీసుకుంటే.. ఇక అభివృద్ధి పనుల్లో నాణ్యత ఎలా ఉంటుంది..? అని తీవ్ర ఆరోపణలు చేసింది. కాగా, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.