Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: గూగుల్ కు మరో షాక్ తగిలింది. ప్లేస్టోర్ విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. జరిమానా మొత్తం రూ.936.44 కోట్లలో 10 శాతం సొమ్మును నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఎన్సీఎల్ఏటీలో వారం వ్యవధిలోనే గూగుల్‌కు ఇది రెండో ఎదురుదెబ్బ.
ప్లే స్టోర్ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుండటంతో సీసీఐ రూ.936.44 కోట్ల భారీ జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా, నిర్దేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా సీసీఐ ఆదేశించింది. అలాగే థర్డ్-పార్టీ బిల్లింగ్/ యాప్‌ల కొనుగోలుకు చెల్లింపు సేవలను వినియోగించుకోకుండా యాప్ డెవలపర్లను అడ్డుకోరాదని ఆదేశించింది. అంతకుముందు ఆండ్రాయిడ్ మొబైళ్ల విభాగంలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నందునందకు గానూ విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాకు ఇది అదనం. గూగుల్ కు మొత్తంగా రూ.2200 కోట్ల జరిమానా విధించారు. అయితే ఈ వ్యవహరంలో గూగుల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించిన సంగతి, జరిమానా మొత్తంలో 10 శాతం చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్లేస్టోర్ విభాగానికి సంబంధించిన కేసును బుధవారం విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. స్టేకు నిరాకరించింది. సీసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.
16న సుప్రీంలో విచారణ
ఆండ్రాయిడ్ విషయంలో విధించిన జరిమానాపై గూగుల్ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. జనవరి 16న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. సీసీఐ విధించిన రూ.1338 కోట్ల అపరాధ రుసుముపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ ఎన్సీఎల్ఏటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టులో గూగుల్ సవాలు చేసిన సంగతి తెలిసిందే. సీసీఐ ఉత్తర్వుల అమలుకు జనవరి 19 వరకు గడువు ఉన్న నేపథ్యంలో గూగుల్ సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.