Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: అమెరికాలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా విమాన సేవలు నిలిచిపోయాయి. దీంతో విమానాలన్నీ ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేందుకు ఎఫ్ఏఏ, ఎయిర్లైన్లకు ఇచ్చే నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఎఫ్ఏఏ ట్విటర్లో వెల్లడించింది. దీన్ని పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం, కానీ, ఎప్పటికి పరిష్కారమవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని ఎఫ్ఏఏ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయానికి దేశవ్యాప్తంగా 400లకు పైగా విమానాల రాకపోకలకు ఆటంకం కలిగినట్టు ఫ్లైట్ అవేర్ డేటా వెల్లడించింది.
దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నామని, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకర్ ప్రకారం.. ఇప్పటివరకు అమెరికాలో, వెలుపలకు సంబంధించి దాదాపు 760లకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. మరోవైపు, విమానాలు నడుస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. భారీ జాప్యంతో ఉన్నాయని మరికొన్నినివేదికలు పేర్కొంటున్నాయి.