Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సంక్రాంతి పండగ కు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. పండగకు రెండు రోజులు ముందుగానే ఊళ్లకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుండడంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండగకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పండగ సందర్భం గా దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 10 నుంచి 19 వరకు దాదాపు 300కు పైగా స్పెషల్ రైళ్లు నడిపిస్తోంది. రోజువారీ నడిచే 278 సాధారణ రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లు తిరుగుతున్నా రద్దీ తగ్గడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి గురువారం ఒక్క రోజే 5 లక్షల మంది ప్రయాణించారు. అలాగే 3,800 రెగ్యులర్ బస్సులతోపాటు 500స్పెషల్ బస్సులు, ప్రైవేట్ బస్సుల్లో మరో 3 లక్షల మంది తరలివెళ్లినట్లు అధికారులు తెలిపారు. రైళ్లలో రిజర్వేషన్ టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రయాణికులకు చార్జీల మోత భారంగా మారింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు, రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. పండగ కోసం 4233 ప్రత్యేక బస్సులను నడపడానికి ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసినా మరో 1000 బస్సులకు డిమాండ్ పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం మరింత రద్దీ పెరుగుతుందని చెబుతున్నారు. హైదరాబాద్-విజయవాడ, హైదారాబాద్-వరంగల్ జాతీయ రహదారులపై పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజుల్లో 35 వేల వాహనాలు వెళ్తుండగా, గురువారం 55 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి.