Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్యానా మాజీ మంత్రి మాంగేరామ్ రాఠీ కుమారుడు జగదీశ్ రాఠీ విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ సహా ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 55 సంవత్సరాల జగదీశ్ రాఠీ బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్టు ఝజ్జర్ ఎస్పీ వసీమ్ అక్రం తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం మరణానికి గల కారణం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన మరణానికి మాత్రం విషమే కారణమన్నారు. కాగా, ఆస్తి సంబంధ విషయంలో జగదీశ్ వేధింపులు ఎదుర్కొన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా ఆయన తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయినట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జగదీశ్ కూడా ఇటీవల ఓ ఆడియో క్లిప్ ద్వారా వెల్లడించారు. డిసెంబరు 26న జగదీశ్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేస్తూ వీరందరూ తనను వేధిస్తున్నారని, తనకేమైనా జరిగితే అందుకు వారే బాధ్యులు అవుతారని అందులో ఆరోపించారు. దీంతో పోలీసులు ఆయనను కలిసి ఫిర్యాదు చేయాలని కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. బుధవారం సాయంత్రం విషం తీసుకుని జగదీశ్ ఆత్మహత్య చేసుకున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు.