Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ఐదో మహాసభలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ మహాసభలను రంగారెడ్డి జిల్లా సాగర్ రోడ్ మన్నెగూడలోని బీఎంఆర్ సార్థా కన్వెన్షన్‌లో రెండురోజులపాటు నిర్వహించనున్నారు. టీఎస్‌యూటీఎఫ్ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లతో ఆ ప్రాంతమంతా ముస్తాబైంది. ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, యాజమాన్యాలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల నుంచి 550 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు ఉపాధ్యాయుల మహాప్రదర్శన, బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో కేరళ మాజీ మంత్రి కెకె శైలజా టీచర్ ప్రారంభోపన్యాసం చేస్తారు. అతిధులుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆహ్వానసంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు నిర్వహించిన పోరాటాలను సమీక్షిస్తారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేస్తారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు.