Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: సాధారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని సార్ అని, ఉపాధ్యాయిని అయితే మేడమ్ అని సంబోధిస్తుంటారు. పాఠశాలల్లోనే కాదు.. బయట కూడా పురుషులను సార్ అని, మహిళలను మేడమ్ అని గౌరవంగా పిలుస్తాం. అయితే, ఇకపై పాఠశాలల్లో ఈ రెండు పదాలు వాడొద్దని, ఇద్దర్నీ ‘టీచర్’ అని మాత్రమే సంబోధించాలని కేరళ బాలల హక్కుల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా సాధారణ విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అనే పదం పురుషులకు, మహిళలకు ఇద్దరికీ వర్తిస్తుందని, విద్యార్థి దశలోనే పిల్లలకు స్త్రీ, పురుషులిద్దరూ సమానమే (లింగ సమానత్వం)నని చెప్పేందుకే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు బాలల హక్కుల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. కేరళ స్టేట్ కమిషన్ ప్యానల్ ఛైర్పర్సన్ కేవీ మనోజ్, విజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. పాఠశాలల్లో కేవలం ‘టీచర్’ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని గత బుధవారం సాధారణ విద్యాశాఖకు మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. సార్, మేడమ్ అని కాకుండా టీచర్ అని పిలవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య అనుబంధం మరింతగా పెరుగుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ‘ సార్/మేడం’ అనే పదాలకు స్వస్తి చెప్పాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతోనే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. తాజా ఉత్తర్వుల అమలు తీరుపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల కమిషన్ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.