Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ తరుణంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం అన్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునురుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్యరాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందనీ సీఎం పేర్కొన్నారు. యావత్ భారత ప్రజల సహకారంతో, సమిష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనా ను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్ది కి బాటలు వేయాల్సిన అవసరం వుందన్నారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనీ, ప్రతీ ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని సీఎం ఆకాంక్షించారు.