Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పంతంగి టోల్ గేట్ మీదుగా వెళ్లిన వాహనాల వివరాలను ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గత రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 1.24లక్షల వాహనాలు వెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జనవరి 12న 56,500వాహనాలు వెళ్లగా 13న 67,500 కార్లు వెళ్లినట్లు వివరించారు. అయితే పండుగల కోసం వెళ్తున్న వారిలో 90శాతం మంది వ్యక్తిగత వాహనాల ద్వారానే వెళ్లినట్లు, రెండు రోజుల్లో మొత్తం 98వేలకు పైగా కార్లు హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ గేట్ మీదుగా విజయవాడ వెళ్లినట్లు పోలీసుల లెక్కల్లో తేలింది.
అంతే కాకుండా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బీబీనగర్ టోల్ గేట్ మీదుగా నిన్న 26వేల వాహనాలు వెళ్లాయని అందులో 18వేల కార్లు ఉన్నట్లు తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు 13వేలకు పైగా వాహనాలు వచ్చినట్లు, ఎల్బీనగర్, ఉప్పల్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బృందాల సాయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరినీ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. టోల్ గేట్ల వద్ద వాహనాలను క్రమ పద్ధతిలో పంపించేందుకు జీఎంఆర్ సిబ్బంది సాయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.