Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా బీజేపీకి అనుకూలం అనుకుంటే పొరబాటేనని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. రానున్న ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆర్థిక వేత్త దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్రే కీలకం. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తాయని నేను భావిస్తున్నా. సమాజ్‌వాదీ పార్టీకి కూడా అవకాశం ఉంది కానీ.. అది ఎంతవరకు అనేది చూడాలి. బీజేపీకి ఎదురునిలిచే పార్టీ లేదనే ఒక ఆలోచనను కలిగి ఉండటం తప్పనుకుంటున్నా. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూ కొత్త పొత్తులకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ద్విముఖ పోరు బీజేపీ ఓటమికి దోహదం చేస్తుందని అవి అంచనా వేస్తున్నాయి. మరోపక్క, భారత్ విజన్‌ను బీజేపీ గణనీయంగా తగ్గించింది. ఈ సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోతే మంచిది కాదు. అయితే ఆ పార్టీకి బలంతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయి. మిగతా పార్టీలన్ని గట్టిగా ప్రయత్నిస్తే.. బీజేపీకి గట్టిపోటీ ఇవ్వొచ్చు’ అని తన అభిప్రాయాన్ని అమర్త్యసేన్ స్పష్టంగా వెల్లడించారు.