Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు సంక్రాంతి నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం సోమవారం నుంచి ఈ రైలు రాకపోకలు ప్రారంభిస్తుందని వారు వెల్లడించారు. టికెట్ల రిజర్వేషన్ శనివారం నుంచే ప్రారంభమైనట్టు తెలిపారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు 20833 నంబర్‌తో, సికింద్రాబాద్ నుంచి విశాఖకు 20834 నంబర్‌తో ఈ రైలు రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే ఉంటుందని, ఆదివారం సర్వీసు ఉండదని తెలిపారు. విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందేభారత్, సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే రైలు ఆగుతుందని తెలిపారు. రైలులో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ పేరిట రెండు తరగతుల సీట్లు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖకు చైర్‌కార్‌కు రూ.1665, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కు రూ.3,120గా టికెట్ ధరను ఖరారు చేశారు. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌కార్ టికెట్‌కు రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కు రూ.3,170గా చార్జీలను ఖరారు చేశారు. ఈ రైలులో ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం అందజేస్తారు. ఈ కారణంగా టికెట్ ధరల్లో మార్పు ఉన్నట్టు అధికారులు తెలిపారు.