Authorization
Fri May 16, 2025 03:32:13 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకొంది. కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం, పాత విమానాశ్రయం మధ్య చోటు చేసుకొంది. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్ సిబ్బంది సుదర్శన్ బర్తౌలా ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తెక్ బహదూర్ కేసీ స్థానిక పత్రికలకు వెల్లడించారు. విమాన ప్రమాదం జరిగిన చోట భారీగా మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం కాలిపోయింది. ఇప్పటికీ ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరినీ కాపాడలేకపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విమానంలో 10 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.