Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: నేపాల్ విమాన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 31 మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. తాజాగా మరో 37 మృతదేహాలను బయటకి తీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 68కి చేరింది. ఈ మేరకు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. మిగిలిన నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద స్థలంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగించడం కష్టమవుతోంది. ఒకవైపు మంటలను అదుపు చేస్తూనే.. మృతదేహాలను బయటకు తీస్తున్నారు.
68 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బందితో కలిపి 72 మందితో యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం ఖట్మాండ్ నుంచి పొఖారాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు చిన్నారులతో సహా 15 మంది విదేశీయులు ఉన్నట్లు నేపాల్ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. 53 మంది నేపాలీ దేశీయులు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, అర్జెంటీనా, ఐర్లాండ్,ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌కు చెందిన ఒక్కో ప్రయాణికుడు ఉన్నట్టు యతి ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
తాజా ఘటన నేపథ్యంలో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఖట్మాండ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఖట్మాండ్, పొఖారా నగరాల మధ్య ప్రయాణ సమయం 25 నిమిషాలు మాత్రమే. అంటే మరో 5 నిమిషాల్లో విమానం గమ్యం చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై భారత పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు నేపాల్‌లోని భారత్ రాయబార కార్యాలయం కూడా స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది. బాధితుల వివరాల కోసం ఖట్మాండ్ 9851107021, పొఖారా 9856037699 నంబర్లను సంప్రదించాలని కోరింది.