Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సుప్రసిద్ధ దర్శకుడు, ఆస్కార అవార్డు గ్రహీత జేమ్స్ కామెరాన్ తో మరో దిగ్గజ దర్శకుడైన ఎస్ఎస్ రాజమౌళి భేటీ అయ్యారు. రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కామెరాన్ ప్రశంసించడమే కాకుండా, తప్పకుండా చూడాలని భార్యకు సైతం సూచించారు. ఈ క్రమంలో కామెరాన్, రాజమౌళి వీరిద్దరూ ఒకేచోట కలుసుకుని ముచ్చటించుకున్నారు. రాజమౌళి ట్విట్టర్ లో పలు ఫొటోలు ఉంచారు. అవతార్ డైరెక్టర్ తనతో 10 నిమిషాల సమయం వెచ్చించి, సినిమా గురించి చర్చిస్తారని అనుకోలేదంటూ పోస్ట్ పెట్టారు. ‘‘గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు. సినిమా ఆయనకు ఎంతో నచ్చడమే కాకుండా, ఆ సినిమాను వీక్షించాలంటూ భార్య సుజీకి సూచించి, ఆయన కూడా ఆమెతో కలిసి మరోసారి చూశారు. ‘సర్ మీరు మాతో 10 నిమిషాల సమయం వెచ్చించి, మా సినిమా గురించి విశ్లేషిస్తారని అనుకోలేదు. మీరన్నట్టు, నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అంటూ రాజమౌళి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. కామెరాన్ తో ముచ్చటిస్తున్న ఫొటోలను సైతం ఉంచారు.