Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ - హైదరాబాద్
1998 డిఎస్సీలో క్వాలిఫైడ్ అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగాలివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. 1998 డిఎస్సీలో క్వాలిఫైడ్ అభ్యర్థులు గతంలో తమరిచ్చిన హామీ మేరకు తమరి క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షంగా కలిసి, చర్చించి తప్పకుండా టీచర్ ఉద్యోగాలిచ్చి ఆదుకుంటానని హామీ యిచ్చియున్నారు. మీ హామీ మేరకు సదరు అభ్యర్థులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉద్యోగాల కొరకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. న్యాయ స్థానాలు కూడా వీరికి అనుకూలంగా తీర్పులిచ్చాయి. 20 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం పోరాడుతూ, స్వరాష్ట్రం సిద్దిస్తే తప్పక ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగులు (ఎం.టి.ఎస్. మినిమం టైం స్కేల్ పద్ధతి) ఇస్తున్నట్లు, అందుకు ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. వీరంతా ఉమ్మడి రాష్ట్రంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు. పొరుగు రాష్ట్రం సానుకూలంగా స్పందించి, పోస్టింగ్లు యివ్వడానికి సిద్దపడటం సంతోషకరమైన విషయం. ఇప్పటికే వయోపరిమితి దాటి, సకాలంలో ఉద్యోగాలు రాక, ఏళ్ళ తరబడి ఎదురుచూస్తూ మానసిక క్షోభకు గురై మొత్తం 4310 మందిలో కొంత మంది మరణించగా ప్రస్తుతం 1500 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిలో కూడా ఉద్యోగం చేయగలిగే వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. కావున తమరు ఇప్పటికైనా మానవతాదృక్పదంతో స్పందించి, వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలె కనీసం ఎం.టి.ఎస్. పద్దతిలోనైనా టీచర్ ఉద్యోగాలు ఇచ్చుటకు అవసరమైన చర్యలు తీసుకొని, వారి కుటుంబాలను ఆదుకోవాలని లేఖ ద్వారా కోరారు.