Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) పనితీరుపై భారత ఎన్నికల సంఘం డెమో నిర్వహించింది. సోమవారం జాతీయ, ప్రాంతీయ పార్టీలతో భేటీ అయిన ఈసీ ఆర్వీఎం పనితీరుపై డెమో ఇచ్చింది. ఇంటి వద్ద కాకుండా దూరంగా ఉండేవారు ఓటు హక్కు వినియోగించునేలా సిద్ధం చేసిన ఈ వ్యవస్థ డెమోకు 8 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల కమిషన్ పిలిచింది. అయితే, ఈ వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాలను కాంగ్రెస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.
ఆర్వీఎంల పనితీరుకు ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు వివరించారు. ఆర్వీఎంలతో ఓటర్లు ఎక్కడనుంచైనా తమ ఓటుహక్కును ఉపయోగించుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. ఈ కొత్త మెషిన్ల పనితీరు, ఎన్నికల విధానంలో తీసుకురావల్సిన మార్పులు, వలస కూలీలు ఓటు హక్కు వినియోగం.. తదితరాలపై అభిప్రాయాలను రాత పూర్వకంగా ఈ నెల 31వ తేదీ లోపు తెలియజేయాలని ఈసీ సూచించింది. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు కాంగ్రెస్ ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేడీయూ, శివసేన ఉద్ధవ్ వర్గం, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ(ఎం), జేఎంఎం, ఆర్జేడీ, పీడీపీ, వీసీకే, ఆర్యూఎంఎల్, ఎన్సీపీ, ఎస్పీ సహా 16 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ ఆర్వీఎం ప్రతిపాదనను వ్యతిరేకించడం విశేషం.
సుదూర బూత్‌లలో పోలైన ఓట్ల లెక్కింపు, ఇతర రాష్ట్రాల్లోని బూత్‌ల రిటర్నింగ్ అధికారులను పంపడం సాంకేతిక సవాలు అని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. ఆర్వీఎంను పటిష్టమైన, ఫెయిల్ప్రూఫ్, సమర్థవంతమైన స్టాండ్-అలోన్ సిస్టంగా అభివృద్ధి చేస్తామని కమిషన్ చెప్తున్నది. ఈ వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ ఇంటర్నెట్కు కనెక్ట్ అవదు. గత నెల 29 న ఆర్వీఎం నమూనా మెషిన్‌ను ఈసీ ప్రదర్శించింది. ఈ విధానం అమల్లోకి వస్తే వలసకూలీలు ఓటేయడానికి వారి స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఫలితంగా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఈ విధానంతో ఒక పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల ఎన్నికల ఓటింగ్‌ను నిర్వహించవచ్చునని ఈసీ చెప్తుండటం విశేషం.