Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఓ లేఖ రాశారు. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిని చేర్చుకోవాలని ఆ లేఖలో సూచించారు. ఇలా చేయడం వల్ల 25 ఏండ్ల క్రితం ఏర్పాటైన ప్యానెల్లో పారదర్శకతతోపాటు జవాబుదారీని నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో ఇదే కిరణ్ రిజిజు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆరోపణలు చేశారు. హైకోర్టులో న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలన్నారు.
దేశంలోని అన్ని హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాలతో పాటు బదిలీల ప్రక్రియను ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని కొలీజియం చూస్తున్నది. కాగా, ఈ విధానంపై గత కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అన్ని వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదనే అపవాదును కూడా కొలీజియం మూటగట్టుకున్నది. ఇదే సమయంలో ఎలాంటి రాజకీయలకు తావులేకుండా న్యాయమూర్తుల నియామకాలు జరుగుతున్నాయనే మంచి పేరును కూడా పొందింది. అయితే, కొలీజియంలో పారదర్శకత కరువైందని, జవాబుదారీతనం లేదని గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తూ వస్తున్నది. ఇలాఉండగా, కేంద్రం చేసిన సూచనలను సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.