Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో అప్పుడే ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యూహరచనలో మునిగిపోయాయి. మరోవైపు, మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరుతున్న సందర్భంగా మంగళగిరిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల శైలిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. వాస్తవానికి కాండ్రు శ్రీనివాసరావు వైసీపీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు కానీ, సముచిత స్థానం కానీ లభించలేదని ఆయన అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.