Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బెంగళూరు: బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేశ్యలతో ఆ పార్టీ నేత పోల్చారు. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్ మంగళవారం హోస్పేట్లో ప్రసంగించారు. 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడాన్ని ఈ సందర్శంగా ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కూడా బీజేపీలో చేరిన వారిలో ఉండటంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఈ విమర్శలు చేశారు.
‘మీరు స్పష్టమైన మెజార్టీ ఇవ్వనప్పుడు మేం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. కూడు కోసం శరీరాన్ని అమ్ముకునే స్త్రీని వేశ్య, ఇతర పేర్లతో మనం పిలుస్తాం. తమను తాము అమ్ముకున్న ఎమ్మెల్యేలను మీరు ఏమని పిలుస్తారో మీకే వదిలేస్తున్నా. తన ఆత్మగౌరవంతో సహా సర్వస్వం అమ్ముకున్న స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పండి’ అని మంత్రి ఆనంద్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీతోపాటు సెక్స్ వర్కర్స్ కమ్యూనిటీ నుంచి విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆయన బుధవారం క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ట్వీట్ చేశారు. ‘ఆత్మగౌరవంతో జీవించే మహిళలు, సెక్స్ వర్కర్ కమ్యూనిటీకి గొప్ప గౌరవం ఉంది’ అని అందులో పేర్కొన్నారు. తన ప్రసంగంలో ‘వేశ్య’ ప్రస్తావనను తప్పుగా అర్థం చేసుకుని అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి దురుద్దేశం లేని తన మాటలు సెక్స్ వర్కర్ కమ్యూనిటీని కించపరిచేలా ఉంటే క్షమించాలని అందులో కోరారు.