Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో
ఉత్తరప్రదేశ్‌లో ఖేరీ జిల్లాలోని మహమ్మది పట్టణంలో సారయ్య ప్రాంతంలో కలుషిత నీరు తాగడం వల్ల గత వారంలో ఐదుగురు చిన్నారులు చనిపోయారు. మరో 9 మంది పిల్లలతోపాటు సుమారు 20 మంది స్థానికులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ గుప్తా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. తాగు నీటి నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు.
అయితే గత వారం రోజుల్లో 14 నెలల వయస్సున్న ఉమ్రా మహమ్మద్, మహ్మద్ అజాన్ అనే నాలుగేళ్ల బాలుడితోపాటు పదేళ్ల కంటే తక్కువ వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు డాక్టర్ గుప్తా తెలిపారు. ఈ పిల్లలు అతిసారం వంటి లక్షణాల వల్ల చనిపోయినట్లు, ఆరోగ్య అధికారులు ఈ ప్రాంతంలో 472 ఇళ్లను తనిఖీ చేసినట్లు వివరించారు. పిల్లల మరణానికి కలుషిత తాగు నీరు ప్రధాన కారణంగా గుర్తించినట్లు తెలిపారు. తాగు నీటి పైప్ లైన్ లీకేజీ వల్ల మురుగు నీరు కలిసి తాగు నీరు కలుషితమవుతున్నదని అన్నారు.