Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
నేడు ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోందన్నారు. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందంన్నారు. కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారని పినరయి విజయన్ అన్నారు. అంతే కాకుండా కేంద్రంలో బీజేపీ సర్కార్ అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ చేపట్టిన పోరాటాలకు మా మద్దతు ఉంటుంది.
ఇవాళ కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది. దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి పాలిస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు యత్నిస్తున్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. న్యాయ వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మోడీ కార్పొరేటర్లకు తొత్తుగా మారారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు అని పినరయి విజయన్ ప్రసంగించారు.