Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ భువనేశ్వర్: ఒడిశా మాజీ సీఎం బీజూ పట్నాయక్ వినియోగించిన డకోటా విమానాన్ని ఎట్టకేలకు కోల్‌కతా నుంచి భువనేశ్వర్‌కు మూడు లారీల్లో తరలించారు. బీజూ పట్నాయక్ వినియోగించిన డకోటా విమానం శిథిలావస్థకు చేరి కోల్‌కతాలోని నేతాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దశాబ్ధాలుగా పడి ఉంది. దీనిని ఒడిశాకు తరలించేందుకు సీఎం నవీన్ పట్నాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అయితే 2020లో జరుగాల్సిన ఈ పాత విమానం తరలింపు కరోనా కారణంగా ఆలస్యమైంది.
మరోవైపు బీజూ పట్నాయక్ వినియోగించిన డకోటా విమానాన్ని చివరకు పలు భాగాలుగా విడదీసి మూడు లారీల్లో కోల్‌కతా విమానాశ్రయం నుంచి ఒడిశాకు తరలించారు. మార్గమధ్యలో దీనిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో ఆ లారీల వద్దకు వచ్చారు. భువనేశ్వర్‌లోని బీజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానాన్ని ఉంచుతారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దీని కోసం 1.1 ఎకరాల భూమి కేటాయించింది. బీజూ పట్నాయక్ బ్రిటీష్ పాలనలోని రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్. కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా కళింగ ఎయిర్‌లైన్స్‌ను కూడా స్థాపించారు. స్వాతంత్ర సమరయోధులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రహస్యంగా ఆయన తరలించారు. 1947 ఏప్రిల్‌లో అప్పటి ఇండోనేషియా ప్రధాని సుతాన్ సజహ్రీర్ను రక్షించేందుకు డకోటా విమానాన్ని ఉపయోగించారు. దీనికి గాను ఇండోనేషియా ప్రభుత్వం కృతజ్ఞతగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భూమిపుత్ర’తో బీజూ పట్నాయక్‌ను రెండు సార్లు సత్కరించింది.