Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనేశ్వర్
ఒడిశాలోని కటక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జాజ్‌పూర్ జిల్లా ధామశాలకు చెందిన 23 ఏళ్ల మనోజ్ కుమార్ బెహెరా, కటక్‌లోని శ్రీశ్రీ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జిల్లాలోని సంధాపూర్ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ప్రియురాలైన యువతి కూడా సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు లాప్టాప్లో వీడియో కాల్ ద్వారా యువతితో మాట్లాడాడు.
ఈ తరుణంలో ఆ జంట మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలు వీడియో కాల్లో ఉండగానే డోర్‌ను లాక్ చేశాడు. గదిలోని రూఫ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో యువతి వెంటనే పరుగెత్తుకుని ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లింది. తలుపులు బలంగా కొడుతూ బోరున ఏడ్చింది. గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఉరికి వేలాడుతున్న మనోజ్‌ను వెంటనే ఎస్సీబీ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. యువకుడి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.