Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 చోట్ల అధికారులు శిబిరాలను ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా అన్నిరోజుల్లో కంటి పరీక్షలు చేస్తారు.
ఇంటింటికి వెళ్లి కంటివెలుగు స్లిప్పులను ఏఎన్ఎంలు పంపిణీ చేయనున్నారు. వ్యక్తి వివరాలు, టెస్టుకు వెళ్లాల్సిన ప్రాంతం, సమయాలను అందులో పొందుపరుస్తారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 120 మందికి పరీక్షలు చేయనున్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు. ఇక ఎవరికైనా కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తే ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఆ వివరాల్ని తీసుకొని కంప్యూటర్లో నమోదు చేయించే ఉన్నతాధికారులు.. ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడు, ఎక్కడ ఆపరేషన్ ఉండేదీ లబ్దిదారులకు ఒకట్రెండు రోజుల్లో చెబుతారు. ఆ ప్రకారం లబ్దిదారులు ఆయా ఆస్పత్రికి వెళ్లి.. ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.