Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ : నగరంలోని అనుమతి లేని పరిశ్రమలు, గోదాంలపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లో డెక్కన్ స్టోర్స్‌లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలుగా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదని చెప్పారు. భవనంపై చిక్కుకున్న ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారని, దుకాణంలో ఇద్దరు చిక్కుకొని ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని, మరో రెండు గంటల్లో అదుపులోకి తీసుకువస్తారన్నారు. చుట్ట పక్కల ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న మంత్రి.. ఇండ్ల మధ్య గోదాములు, పరిశ్రమలు ఉండడం దురదృష్టకరమన్నారు. వీటితో ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తోందన్నారు. నగరంలో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రభుత్వం చర్యలు చేపడితే 25వేల దుకాణాలు ఖాళీ చేయించాల్సి ఉంటుందని వెల్లడించారు. భారీ స్థాయిలో దుకాణాలు తరలిస్తే వ్యాపారులు ఆందోళన చేపడుతారన్న మంత్రి.. ఆందోళనలు చేస్తారని భయపడి ఊరుకులేది లేదన్నారు. అక్రమ గోదాంలు, పరిశ్రమలు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జనావాసాల మధ్య అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన గోదాంలు తదితర వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు.