Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జార్ఖండ్
జార్ఖండ్‌లో ఆదివాసీలు పోరుబాట పట్టారు. బొగ్గు తవ్వకాలకు వ్యతిరేకంగా వారు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నది. వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీ చార్జ్ చేయగా.. ఆగ్రహించిన ఆదివాసీలు బాణాలతో దాడికి దిగారు. దాంతో గొడ్డాలో వాతావరణం వేడెక్కింది. జార్ఖండ్‌లోని గొడ్డాలో బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ గిరిజనులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు-పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. గిరిజనులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు పోలీసులపైకి బాణాలు, విల్లులతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఎస్డీఓపీ సహా ఐదుగురు జవాన్లు, పలువురు గిరిజనులు కూడా గాయపడ్డారు.
ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన రాజ్‌మహల్-లాల్మతియా బొగ్గు ప్రాజెక్టు గొడ్డాలో చేపడుతున్నారు. చాలా రోజులుగా గిరిజనులు ఈ ప్రాజెక్టును గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని గిరిజనులను పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఒకేసారి వేయి మంది జవాన్లు వచ్చి జనాన్ని గ్రామాల నుంచి తరిమేశారు. వీరిని ఎదుర్కొనేందుకు వేలాది మంది ఆదివాసీలు ఏకమై బాణాలు, విల్లులతో సిద్ధంగా ఉండి నిరసన తెలుపుతున్నారు. కాగా, మహాగామ సబ్ డివిజన్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలను విధించారు.