Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రంగా రెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ నగర్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ తరుణంలో ఆమె కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నారని మంత్రి అన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 80 టీములు పనిచేస్తున్నాయని ఇప్పటికే లక్ష కళ్ళజోళ్ళు అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయం తో పని చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. 18 సంవత్సరాల నిండిన వారికి,వందరోజుల పాటు, వారానికి ఐదు రోజులు, ప్రతిరోజు 300 మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
పరీక్షలు నిర్వహించిన వెంటనే కళ్లద్దాలు పంపిణీ జరుగుతుందని అదేవిధంగా ఆపరేషన్ అవసరం ఉన్నవారికి వారికి అందించిన తేదీలలో చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నాయకులు, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.