Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -లక్నో
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో స్థానిక హిందూ కాలేజీలో చదువుతున్న ముస్లిం విద్యార్థినులు బుధవారం బురఖాలు ధరించి కాలేజీకి వచ్చారు. అయితే వారిని క్యాంపస్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్థినులు నిరసనకు దిగారు. కాలేజీ గేట్ వద్ద బలవంతంగా బురఖాలను తొలగించారని ఆరోపించారు.
కాగా, జనవరి నుంచి కాలేజీలో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రొఫెసర్ ఏపీ సింగ్ తెలిపారు. డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన వారిని క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామన్నారు. ఈ తరుణంలో కాలేజీ డ్రెస్ కోడ్‌లో బురఖాను కూడా చేర్చాలని సమాజ్‌వాదీ విద్యార్థి సంఘం (ఎస్సీఎస్) స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. తద్వారా బురఖా ధరించిన విద్యార్థినులను కూడా కాలేజీలోకి అనుమతించాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.
ఇదే క్రమంలో గురువారం సమాజ్ వాదీ విద్యార్థి సంఘం (ఎస్సీఎస్), బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘానికి చెందిన స్టూడెంట్లు ఘర్షణకు దిగారు. ఈ పరిణామంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ ఎమ్మెల్యే జమీర్ ఉల్లాఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బురఖాను వ్యతిరేకించే వారికి గుణపాఠం చెప్పాలి. బురఖాపై నిషేధం విధించిన వారిని నగ్నంగా ఊరేగించాలన్నారు.