Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామారెడ్డి: రైతుల డిమాండ్లకు కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం దిగివచ్చింది. రేపు (శుక్రవారం) మున్సిపల్ పాలకవర్గం అత్యవసర సమావేశానికి నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. పచ్చని పంట భూములను మాస్టర్ ప్లాన్‌లో ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లుగా గుర్తించారంటూ అన్నదాతలు ఆగ్రహంతో ఆందోళన బాటపట్టారు. ఇండస్ట్రియల్ జోన్‌తో తన భూమి విలువ ఎక్కడ పడిపోతుందోనని మనోవేదనతో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. మాస్టర్ ప్లాన్ రద్దు, డీటీసీపీపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. డిజైన్ డెవలప్మెంట్ ఫోరమ్, పట్టణ ప్రణాళిక జాయింట్ డైరెక్టర్‌పై చర్యలకు మున్సిపల్ సమావేశంలో తీర్మానించాలని రైతులు పట్టుబట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నాయకుల భూముల విలువ పెంచేందుకే మాస్టర్ ప్లాన్‌ను తెరమీదకు తెచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ రైతులకు బాసటగా నిలిచాయి. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 1,365కు పైగా అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్‌పై బాధిత రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి విస్తరిస్తోంది. శివారు గ్రామాలను కామారెడ్డి మునిసిపాలిటీలో విలీనం చేశారు. సరంపల్లి, దేవునిపల్లి, లింగాపూర్, టెక్రియాల్, ఇల్చిపూర్, అడ్లూర్, రామేశ్వర్‌పల్లి గ్రామాలతో పాటు పొరుగు మండలమైన సదాశివ నగర్‌లోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన భూములను పట్టణంలో కలుపుతూ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దీనిలో పట్టణ విస్తీర్ణం 61.55 చదరపు కిలో మీటర్లుగా చూపా రు. ఇందులో రెసిడెన్షియల్ ఏరియా 6,806 ఎకరాలు, కమర్షియల్ ఏరియా 557 ఎకరాలు, మల్టీపర్పస్ 667 ఎకరాలు, ప్రభుత్వ భవనాలు, స్థలాలు 635 ఎకరాలు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం 1,445 ఎకరాలు, ఇండస్ట్రియల్ ఏరియా 1210 ఎకరాలుగా ప్రతిపాదించారు.